మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదని.. తన కుమార్తె మృతికి కారణమైన వారికి శిక్ష పడాలని సుగాలి ప్రీతి తల్లి చట్టాలను తెలుసుకున్నారని తెలిపారు. మహిళలు ఇబ్బందులు పడుతోంటే.. పెంపకం సరిగా లేదనే కామెంట్లు మంత్రుల నుంచి రావడం సరికాదన్నారు. వైసీపీకి ఆశ ఉంటే.. జనసేన పార్టీకి ఆశయం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Read Also: Vishnu Vardhan Reddy: అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దు
జనసేనకు ఓటమిని తట్టుకునే శక్తి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజ క్షేమమే జనసేన పార్టీ ధ్యేయమన్నారు. సుగాలి ప్రీతి, వనజీవి రామయ్య వంటి వారు గొప్ప వాళ్లు అని.. అధికారం ఉన్న రాజకీయ నేతలు అల్పులు అని పవన్ తెలిపారు. అలాంటి అల్పులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను వేధించే వారిని.. దోపిడీ చేసే వారిని ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో మద్యపానం నియంత్రణ చేస్తానన్నారని.. ఉపాధి కల్పిస్తామన్నారని.. కానీ ప్రతిదీ రివర్సే జరిగిందని పవన్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పెద్ద పార్టీల వల్ల కూడా రాదనుకున్న మార్పు కేజ్రీవాల్ పెట్టిన ఆప్ వల్ల వచ్చిందన్నారు. అక్రమంగా సారా మీద సంపాదిస్తుంటే ఏసీబీని నియంత్రించే హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ కోసం జనసేన ఆవిర్భవించిందని.. పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల ప్రొటెక్షన్ కోసం జనసేన పని చేయదని పవన్ అన్నారు. సామాన్యుల ఇబ్బందులను వినేందుకే శనివారం నాడు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.