Site icon NTV Telugu

Pawan Kalyan: రూ.50 వేలు పెట్టుబడి హామీ ఏమైంది?

అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైంది? రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి. రాష్ట్రంలో నిత్యం ఏదొక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరం అన్నారు పవన్.

ఇటీవలే పల్నాడు, కర్నూలు నంద్యాల జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత రైతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని పవన్ డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి.

అయితే ఆ విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి.ఇప్పటి వరకూ ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారు? అసలు ఆ హామీ ఏమైంది?రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది.పంట అమ్ముకొన్నా సొమ్ములు చేతికి రాకపోవడం, తదుపరి పంటకు పెట్టుబడి లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు.

కౌలు రైతులకు బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులను అప్పుల భారం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. పంటకు పెట్టుబడి లేదు, రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు, పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వరు. ఏ దశలోనూ వైసీపీ రైతులకు అండగా నిలబడటం లేదు.

ఈ ప్రభుత్వం చేసింది ఒక్కటే అన్నం పెట్టే రైతులకు కూడా కులాలవారీగా విభజించటమే. జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోందన్నారు పవన్ కళ్యాణ్. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న కౌలు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో ప్రతి ఒక్కరికీ రూ.7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుందన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

Read Also: Left Parties Meeting: మోడీ, జగన్ పోటీపడుతూ జనాన్ని దోచేస్తున్నారు

Exit mobile version