Site icon NTV Telugu

Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం

Pawan Kalyan

Pawan Kalyan

ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. అయితే వ్యక్తిగతంగా ఆయన బిజీ షెడ్యూళ్ల కారణంగానే ప్రధాని పర్యటనకు దూరమైనట్లు జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పవన్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అద్భుతమైన కార్యక్రమం అని పవన్ ప్రశంసించారు. దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోధుడి గొప్పతనం గురించి యావత్‌ ప్రపంచానికి తెలియజేయడానికి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని మోదీకి జనసేన తరపున పవన్ కళ్యాణ్ శుభాభివందనాలు తెలిపారు. భీమవరంలో పోటీ చేసిన తనకు ఇది ప్రత్యేకమని అభివర్ణించారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్ సూచించారు.

Read Also: Nara Lokesh : అల్లూరి విగ్రహావిష్కరణపై ఆసక్తికర వ్యాఖ్యలు..

మరోవైపు టీడీపీ నుంచి ప్రధాని బహిరంగ సభ కార్యక్రమానికి ప.గో. జిల్లా ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన శివరామరాజు హాజరుకానున్నారు. అయితే పీఎంవో అధికారిక షెడ్యూల్‌లో జనసేన నేతల పేర్లు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ఆయన్ను ప్రత్యేకంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవి భీమవరం చేరుకున్నారు. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం.. అందులోనూ అల్లూరి సీతారామ రాజుకు గౌరవంగా నిర్వహిస్తుండటంతో ప్రధాని సభకు హాజరవ్వాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.

అటు ప్రధాని మోదీ భీమవరం పర్యటన జాబితాలో ఎక్కడా తన పేరు లేకపోవడంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తాను భీమవరం రావడం లేదంటూ ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.

Exit mobile version