మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాము ఎవరి పల్లకీలను మోయడానికి లేమని స్పష్టం చేశారు. ప్రజలను పల్లకిలోకి ఎక్కించేందుకే జనసేన ఉందన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు చూసి భరించలేక వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానని.. దానికి వైసీపీ నేతలు ద్వంద్వర్థాలు తీస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించే అన్నాను. వైసీపీ చేస్తోన్న అరాచకాలు.. అన్యాయాలు చూసి భరించ లేక వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పాను. జనసైనికులారా జాగ్రత్తగా ఉండాలంటూ వైసీపీ నేతలు చాలా కామెంట్లు చేశారు… జనసైనికులపై వైసీపీ నేతలు ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం అంతా సవ్యంగా చేస్తే వ్యతిరేక ఓటు ఎందుకు ఉంటుందని పవన్ ప్రశ్నించారు. వ్యతిరేక ఓటు చీలనిచ్చేదే లేదంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకన్నారు. పొత్తులో ఉన్నామంటే ప్రశ్నించం అని అర్థం కాదన్నారు. పొత్తులో ఉన్న పార్టీతో 70 శాతం అంశాలపై ఏకాభిప్రాయం ఉంటే.. 30 శాతం అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉంటాయని పవన్ అన్నారు. తాను మాట్లాడే ఈ వ్యాఖ్యలకు విపరీతార్ధాలు తీయవద్దని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన వ్యతిరేకమని పవన్ తెలిపారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనస్సు మార్చుకుంటుందని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయిస్తుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
జనసేన పార్టీని ఎలా నడుపుతున్నారని చాలా మంది అడుగుతున్నారని.. అందరినీ ఏకం చేసే భావం జాలం కలిగి ఉంటామని పవన్ తెలిపారు. ఒత్తిళ్లను తట్టుకునే మానసిక స్థైర్యం ఉంటేనే పార్టీని నడపడం సాధ్యమన్నారు. ఈ ప్రయాణంలో జనసేన నేతలు.. కార్యకర్తలే తనకు కొండంత బలమన్నారు. కాన్షీరాం స్ఫూర్తితో పార్టీని రన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆరోపించారు. జనసేన ఏనాడూ ఓట్ల కోసం కార్యక్రమాలు చేపట్టదని.. ప్రభుత్వాలని మార్చుకునే సమయంలో జరిగే ప్రక్రియలో భాగమే ఓట్లని జనసేన భావిస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో అన్ని సామాజిక వర్గాల వారూ ఉన్నారని పవన్ అన్నారు. అన్నం పెట్టే రైతుకు కులాలు అంటగడతారా అని ప్రశ్నించారు. ఇంత మంది కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే.. వారికి సాయం ఎలా అందిస్తారని అడుగుతున్నారని.. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయన్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని కౌలు రైతుల కోసం ఇచ్చానని తెలిపారు. దేశం కోసం.. సమాజం కోసం ఎంతో మంది ఆస్తులు.. ప్రాణాలు త్యాగం చేశారని.. ఎన్నికల సమయంలో ఓట్లకు డబ్బులిచ్చి ఓట్లేయించుకుంటే సరిపోతుందా అని నిలదీశారు. అన్నం తినే ప్రతి ఒక్కరికీ రైతు కష్టం అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తామని.. జనసైనికులెవ్వరూ ప్రభుత్వానికి భయపడొద్దని పవన్ సూచించారు.
https://ntvtelugu.com/pawan-kalyan-condolences-to-formers-families-in-andhra-pradesh/