Pawan Kalyan: విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో జైలు నుంచి 9 మంది జనసేన నాయకులు విడుదల కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖపట్నంలో పాలకపక్షం బనాయించిన అక్రమ కేసుల వల్ల జైలుపాలైన తొమ్మిది మంది నేతలు ఈరోజు బెయిల్ మీద బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామం అని పవన్ పేర్కొన్నారు. జనసేన నేతలు జైలులో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసన్నారు. జైలులో ఉన్న నేతల కోసం న్యాయపోరాటం చేసిన పార్టీ లీగల్ సెల్ సభ్యులకు, వారికి అండగా నిలిచిన న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు.
Read Also: Minister KTR : ప్రధానమంత్రికి కేటీఆర్ పోస్ట్ కార్డ్
విశాఖలో అక్రమాలు, తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నదెవరో నగర ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వాస్తవాలు బయటకొస్తాయనే తాము చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం డ్రామా చేసిందని.. అక్రమ కేసుల్లో ఇరికించిందని పవన్ ఆరోపించారు. ఈ అంశంపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగా కేసులు దాఖలు చేయాలని పార్టీ లీగల్ సెల్ సభ్యులకు సూచించామన్నారు. విశాఖలో జరిగిన ఘటనల్లో తమ పార్టీ నేతలు, వీర మహిళలను, జనసైనికులను కావాలని ఇరికించారని తెలిపారు. నియమనిబంధనలకు నీళ్లొదలి అరెస్టులకు పాల్పడ్డారని, మహిళలని కూడా చూడకుండా అర్థరాత్రి వేళ అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
విశాఖలో అక్రమాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే తప్పుడు కేసులు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/13xaEb12Nh
— JanaSena Party (@JanaSenaParty) October 22, 2022