Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!

  • ఏపీలో భారీ రక్షణ రంగ పెట్టుబడులు
  • పుట్టపర్తిలో ఫ్లైట్ టెస్ట్ సెంటర్
  • 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు
  • డ్రోన్ టెక్నాలజీలో ఏపీకి కొత్త దిశ
Pawankalyan

Pawankalyan

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ (Defense) , సాంకేతిక (Technology) రంగాల్లో ప్రపంచస్థాయి హబ్‌గా నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాష్ట్రంలో సుమారు రూ. 15,800 కోట్ల భారీ పెట్టుబడితో రక్షణ, ఏరోస్పేస్ , డీప్ టెక్నాలజీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.

ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం యుద్ధ విమానం ‘అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రోగ్రామ్‌లో ఇది కీలక పాత్ర పోషించనుంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,500 మందికి పైగా యువతకు ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా హై-వాల్యూ టెక్నాలజీ రంగాల్లో యువతకు ఉపాధి దొరకడం వల్ల ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం విమానాల తయారీ మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అత్యాధునిక ‘డ్రోన్ ఎకోసిస్టమ్’ను అభివృద్ధి చేయడం ద్వారా డ్రోన్ టెక్నాలజీలో కూడా ఏపీ అగ్రగామిగా నిలవబోతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమైన ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఈ ప్రాజెక్టు మరింత బలాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి సహకరించిన ప్రధాని మోడీకి, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇండస్ట్రియల్ , టెక్నాలజికల్ ప్రగతికి ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ మెగా అడుగుతో ఏపీ రక్షణ రంగ మ్యాప్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతోంది.