శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి ఆటో దగ్ధమైన ఘటనలు ఐదుగురు సజీవదహనం కావాడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదాకరమన్న ఆయన.. కూలీల సజీవ దహనం ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసిందని.. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటు చేసుకున్న హృదయ విదారకమైన ఈ విషాదం మనసుని కలచి వేసిందన్నారు.. ఆ కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ప్రకటించారు పవన్ కల్యాణ్.. ఇక, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Read Also: APSPDCL: సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై విద్యుత్‌శాఖ వివరణ.. ఉడతే కారణం..!
ఇక, వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటాం.. మరి వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలంటూ ప్రభుత్వానికి సూచించారు పవన్ కల్యాణ్.. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి ఉంటున్నాయి.. అలాగే, జనావాసాల మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం కారణంగానే ఈ రోజు ఐదు నిండు ప్రాణాలు పోయాయని.. తాడిమర్రి దగ్గర చోటుచేసుకున్న దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
కాగా, తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఆటోకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి.. మంటలు ఒక్కసారిగా తీవ్రం కావడంతో ఆటోలో ఐదుగురు సజీవదహనం అయ్యారు.. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు.. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం జగన్.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విదేశాల నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.