Site icon NTV Telugu

YS Jagan: రేపు పల్నాడుకు వైఎస్‌ జగన్.. పోలీసుల ఆంక్షలు..!

Ysjagan

Ysjagan

YS Jagan: రేపు పల్నాడు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వెళ్లనున్నారు జగన్.. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకుంటారు.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.. అయితే, పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సత్తెనపల్లిలో జగన్ పర్యటించి తీరుతారని స్పష్టం చేశారు వైసీపీ నేతలు.. దీంతో, వైఎస్‌ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు, రేపు జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు..

Read Also: Rajasaab- Peddi -War-2 : రాజాసాబ్, పెద్ది, వార్-2 టీజర్లు.. ఏది ఎక్కువ..?

కాగా, వైఎస్ జగన్‌ పర్యటనపై వైసీపీ నేతలు జిల్లా పోలీసుల్ని అనుమతి కోరారు.. అయితే, భారీగా జనం వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు .. వైసీపీ నేతలు అడిగిన విధంగా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే రావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. దీంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. పల్నాడు జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది..

Read Also: Donald Trump: ‘‘విరమణ కాదు, ముగింపు కోసం చూస్తున్నాం’’.. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై ట్రంప్..

మరోవైపు, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. తూబాడులో రైతు గోపాలరావు, నాదెండ్లలో రైతు ఆదినారాయణ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని.. పొగాకు మిర్చి సాగుతో నష్టాలతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.. పండిచిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు.. మిర్చి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. పొగాకు రైతుల కష్టాలపై పొదిలి పర్యటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలను ఎప్పుడైనా ప్రభుత్వం పట్టించుకుందా..? అని నిలదీశారు.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి విడదల రజిని..

Exit mobile version