కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు.
దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు నిషేధించాలని, ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. అయితే టీటీడీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోకుండా అలసత్వం వహిస్తుంది. ఈ వ్యవహారంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.