ఏపీలో జిల్లాల విభజనతో పలు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కష్టమైన పనే. ఈ విషయంపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి.
ఇదివరకు సముద్రతీరం ఉన్న గుంటూరు జిల్లాలో జిల్లాల విభజన అనంతరం సముద్ర తీరం దూరమైంది. బాపట్ల ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కావడంతో ప్రస్తుతం గుంటూరు జిల్లా తీరం లేని జిల్లాగా మారింది. గతంలో గుంటూరు జిల్లాలో బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరం ఉండేది. ఇప్పుడు సూర్యలంక బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయింది. అలాగే గతంలో సముద్ర తీరం లేని ప్రాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడు తీరప్రాంతం వచ్చి చేరింది. గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతంగా ఉన్న సూళ్లూరుపేట, గూడురు అసెంబ్లీ నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలో కలపడంతో రాయలసీమకు సముద్రం వచ్చింది.
https://ntvtelugu.com/registration-charges-amendment-in-new-district-headquarters-in-andhra-pradesh/