విశాఖ మన్యంలో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్య గిరిజనులు. ఇక గర్భిణీల బాధలు అన్నీ ఇన్నీ కావు. పురిటి నొప్పులతో నిండు గర్భవతి పాపకు జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు చేరింది. ఆ గిరిజన మహిళ మృతి చెందడంతో ఆ చిన్నారితో మరో ముగ్గురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన రహదారి లేని కారణంతో అది రాలేదు. దీంతో ఆ గర్భిణీ నరకయాతన అనుభవించింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ మారుమూల ప్రాంతమైన ఎదురుపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.
గెమ్మిల బాబురావు భార్య గెమ్మిల దివ్య మహిళ నిండు గర్భవతి. నెలలు నిండాయి. రాత్రి నొప్పులు రావడంతో బాధపడుతూ పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. ఈమెకు గతంలో ఇద్దరు బాబులు ఒక పాప జన్మించగా నాలుగవ గర్భందాల్చి పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మారుమూల గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. కొండ ప్రాంతాల్లో డోలి ద్వారా గర్బిణులను ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.