ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో అత్యవసరంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని ఆయన తెలిపారు. 1902 నెంబర్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్లో విద్యార్ధులు మినహా ఇతర ప్రవాసాంధ్రులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ఆయన వెల్లడించారు. ఆ వివరాలను ఉక్రెయిన్ ఎంబసీ నుంచి, ఐబీ స్టాంపింగ్ కార్యాలయం నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులు త్వరితగతిన వారికి సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలను చేరుకుని విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరుతున్నామన్నారు. హంగేరి సరిహద్దుల్లోని జహోరీ బోర్డర్ పోస్టు, పోలాండ్ సరిహద్దుల్లోని క్రాకోవీక్ సరిహద్దు, స్లోవాకియా, అలాగే రోమేనియా సరిహద్దుల్లో విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఆయా కంట్రోల్ రూమ్ ల వద్ద భారత విదేశాంగ శాఖ అధికారుల బృందాలు భారతీయుల్ని సరిహద్దు దాటిస్తారన్నారు.