కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు నో ఏ ఎంట్రీ నిబంధన వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు ఎంట్రీ లేదని చెప్పడం వివాదంగా మారింది.
కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నెలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల నుంచి అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు రిజస్ట్రేషన్ ఆఫీస్ లో రూ. 55,660, కర్నూలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 40,470 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులో 12 మంది, కర్నూలులో డాక్యుమెంట్ రైటర్లు 15 మంది నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలోని 24 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డాక్యుమెంట్ రైటర్లపై ఆంక్షలు విధించారు.
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు డాక్యుమెంట్ రైటర్లను ప్రోత్సహించి వారి చేత ధరలు నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ. అక్రమాల నివారణకు డాక్యుమెంట్ రైటర్లు ఆఫీస్ లోకి ఎంట్రీ లేకుండా చేయాలని నిర్ణయించి ఆమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షులు మాత్రమే ఆఫీస్ లోకి వెళ్లాలని ఆంక్షలు విధించారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ వీక్షించేలా చర్యలు చేపట్టారు. ఏవైనా అక్రమాలు బయటపడినపుడు సీసీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నది అధికారుల ఉద్దేశం. రిజిస్ట్రేషన్ నమూనా వెబ్ సైట్ లో ఉంచి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డాక్యుమెంట్లు తయారు చేసుకొని సామాన్యులు కూడా సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది అధికారుల ఉద్దేశం.
రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విధానాన్ని డాక్యుమెంట్ రైటర్లు వ్యతిరేకిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను అక్రమార్కులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చని, డాక్యుమెంట్ రైటర్లకు అనుమతి లేదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు చేసే వారికి అవగాహన వుండదని, డాక్యుమెంట్లు రాయడం ద్వారా సర్వీస్ చేసి అందుకు చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నామని డాక్యుమెంట్ రైటర్ల వాదన. డాక్యుమెంట్ రైటర్లకు 2002 నుంచి లైసెన్సులు లేవని, ముందుగా లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తామని, లోపలికి ఎంట్రీ లేదనడంలో అర్థం లేదంటున్నారు డాక్యుమెంట్ రైటర్లు.
డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసుల్లోకి రాకూడదన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ లేకుంటే ప్రజలే ఇబ్బందులు పడతారని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు.