Nellore Road Accident Bus Moved Without Driver: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులను బెంబేలెత్తించింది. ఒకవేళ బస్సు కండక్టర్ అప్రమత్తం అవ్వకపోయి ఉంటే, పెద్ద ప్రమాదమే సంభవించేది. అసలేం జరిగిందంటే.. బుధవారం కావలి నుంచి నెల్లూరుకు 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. సరిగ్గా కావలి సమీపంలో ఉన్న టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు.. ఎదురుగా అత్యంత వేగంగా ఓ కారు వచ్చి, బస్సుని ఢీకొట్టింది. చాలా వేగంగా గుద్దడంతో.. డ్రైవర్ ప్రసాద్ అమాంతం ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. దీంతో డ్రైవర్ లేకుండానే బస్సు పరుగులు తీసింది. అది చూసి బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో గగ్గోలు పెట్టారు.
అప్పుడు వెంటనే కండక్టర్ నాగరాజు అప్రమత్తమై.. స్టీరింగ్ వద్దకొచ్చి బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది. దాంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ కండక్టర్ అలా చేయకపోయి ఉంటే, పెద్ద ప్రమాదమే చోటు చేసుకునేది. ఈ ఘటనలో ఎవరి ప్రాణాలు పోలేదు. డ్రైవర్‌తో పాటు పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సైతం స్వల్ప గాయాలే అయ్యాయి. అయితే.. కారు ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జుయ్యింది. అతివేగంతో వచ్చి ఢీకొనడంతో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఆ కారును విశాఖపట్టణానికి చెందిన విజయ్‌పంత్ అనే డాక్టర్‌కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.