కరోనా మందుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య.. ఇప్పుడు కలకలం సృష్టిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా మందు తయారు చేసినట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొంతమంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి రావడం.. స్థానికులు మందు పంపిణీని అడ్డుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు ఆనందయ్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.. ఆనందయ్యకు తాజాగా నోటీసులు జారీ చేశారు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్… కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలపాలని ఆదేశించారు జేసీ.. అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన.. వారంలోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు.. కృష్ణపట్నం గ్రామ పంచాయతీ అత్యవసరంగా సమావేశం నిర్వహించింది… ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది… కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది కృష్ణపట్నం పంచాయతీ.. దీంతో.. ఆనందయ్యకు వరుసగా షాక్‌లు తగిలినట్టు అయ్యింది. అయితే, తన మందు కోసం ప్రజలు ఎందుకు వస్తున్నారో వాళ్లనే అడగాలని.. ఇప్పటికే మందు తీసుకున్నవారు ఏం చెబుతున్నారో కూడా తెలుసుకోవాలంటున్నారు ఆనందయ్య. మరి.. ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందా? లేదా? గతంలో కోర్టుకు ఎక్కినట్టు మరోసారి అలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.