మాజీ మంత్రి, దివంగత ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది.
ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి మే 30న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్‌ల పర్వం మొదలవుతుంది. జూన్ 9 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇప్పటికే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై వైసీపీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక కావడంతో ఎన్నికల బరిలో ఎవరు ఉంటారో అన్న విషయాన్ని సీఎం జగన్ మేకపాటి ఫ్యామిలీకే వదిలేశారు. దీంతో తన చిన్నకుమారుడు విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి నిర్ణయించారు. మేకపాటి విక్రమ్ రెడ్డి స్వయాన దివంగత మంత్రి గౌతంరెడ్డి్కి సోదరుడు అవుతారు. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విక్రమ్‌రెడ్డి తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.