పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు, కేంద్ర జలశక్తి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.
కాగా, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని గిరిజనులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు “జాతీయ ఎస్టీ కమిషన్” కు ఫిర్యాదు చేవారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 (ఎ) ప్రకారం, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.. పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా గిరిజనులను తరలించడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది… ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలలో వాస్తవాలు, తీసుకున్న చర్యలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర అధికారులకు ఆదేశించింది.. ఒక వేళ నిర్ణీత సమయంలో నివేదిక అందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 (ఎ)లో క్లాజ్ (8) ప్రకారం కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.