Nara Lokesh: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ వెల్లడించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో..? ఏది రియలో..? ప్రజలే తేలుస్తారని లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఎలా తేల్చారని ప్రశ్నించారు. అంటే ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని నిలదీశారు. అనంతపురం ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్పర్టా అంటూ లోకేష్ చురకలు అంటించారు. ఫేక్ అయితే నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటి అని సజ్జల ఎలా అంటారని.. అంబటి, అవంతి వాయిస్ ఫేక్ అని తేల్చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలే మాట్లాడుతున్నారని.. మాధవ్ గురించి ఎస్పీకి బాగా తెలుసు అని.. ఎందుకంటే ఇద్దరూ పోలీసులే కదా అని లోకేష్ ఎద్దేవా చేశారు. గోరంట్ల వీడియో ఒరిజినల్ కాదంటూ ఏ ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందో ఎస్పీ బయటపెట్టాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
అటు వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని లోకేష్ ఖండించారు. కుప్పంలో చంద్రబాబు పోటీ ఎంత అనివార్యమో.. మంగళగిరిలో లోకేష్ పోటీ చేయడం కూడా అంతే అనివార్యం అని స్పష్టం చేశారు. ఒకవేళ లోకేష్ ప్రజల్లో తిరగడం లేదు.. తన వల్ల ఉపయోగం లేదని చంద్రబాబుకు నివేదిక అందితే తనను మంగళగిరి నుంచి మార్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మంగళగిరి ప్రజలకు తాను కోవిడ్లోనూ సేవలు అందించానని.. కోవిడ్ తర్వాత కూడా సేవలు అందిస్తున్నానని లోకేష్ తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం వేయాల్సిన రోడ్లు తాను వేయిస్తున్నానని వివరించారు. అటు ఏ సామాజిక వర్గానికి టీడీపీ ఎంత చేసిందో తాను వివరంగా చెప్తానని లోకేష్ పేర్కొన్నారు. దళితుడైన బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసింది టీడీపీ కాదా అని లోకేష్ ప్రశ్నించారు.