Srisailam: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రం అద్భుత దృశ్యాన్ని సంతరించుకుంది.
Read Also: Kohli Breakup Story: విరాట్ కోహ్లీ, అనుష్క “బ్రేకప్”.. ఈ జంటను కలిపిన నటుడు ఎవరో తెలుసా..?
ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీస్వామి, అమ్మవారి అలంకార దర్శనానికి అందరికీ అనుమతి ఇవ్వగా, భక్తులు రెండు నుండి మూడు గంటల సమయం వేచి దర్శనం పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం క్షేత్రం ఈ రోజు మరింత పవిత్రంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవం ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇక, శ్రీశైలం మల్లన్న ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి.. సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ మహోత్సవం నిర్వహించనున్నారు.. ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు..