Site icon NTV Telugu

Maha Shivaratri 2025: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భక్తజనసంద్రంగా కోటప్పకొండ..

Srisailam

Srisailam

Maha Shivaratri 2025: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు, శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం స్వామి, అమ్మవార్లు పుష్ప పల్లకిలో విహరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వేడుకలతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Read Also: YS Jagan: పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్‌.. మధ్యాహ్నం బెంగళూరుకు మాజీ సీఎం..

ఇక…ఈ ఏడాది దేవాదాయ శాఖ భక్తులకు కొత్త సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల కోసం ఉచితంగా లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోమవారం నుంచి ప్రతి భక్తునికి 50 గ్రాముల లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఆలయ సిబ్బంది. లక్షలాదిమంది భక్తులు శ్రీశైలంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులపాటు భక్తులకు లడ్డూ పంపిణిచేయనున్నారు. అమ్మవారి ఆలయ వెనుక భాగంలో పశ్చిమ గోపురం వద్ద ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిచెందిన అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహం నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు బెంగళూరు, కోయంబత్తూరులలో ఉండగా ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో మూడో అతి పెద్ద విగ్రహం రూపుదిద్దుకుంది. ఆదియోగి విగ్రహం వెనుక భాగం నుంచి లోపలకు వెళ్లేందుకు ప్రవేశమార్గం ఉంది. అందులో శివలింగం ఏర్పాటు చేయనున్నారు. అక్కడే ధ్యానమందిరం నిర్మిస్తున్నారు.

Read Also: Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ శివరాత్రి శోభ సంతరించుకుంది. కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేకమంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. ఈ ఏడాది దాదాపు 15 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు. భక్తులు కొండకు వచ్చి పోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 3వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచ హారతులు, మహా నివేదనములతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు ఆలయ ఆర్చకులు. కోటప్పకొండలో మహాశివరాత్రికి ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై ప్రజలు అత్యంత శ్రద్ధ చూపుతారు. ప్రభలను రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభల ఊరేగింపులో మొక్కులు మొక్కుకుంటు ప్రభ ముందు నడుస్తూ కోటప్పకొండకు చేరుకుంటారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తాయి. గ్రామాలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలు చదువుతారు.

Read Also: CM Revanth Reddy: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ!

శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నందివాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ ఉండగా.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..

Exit mobile version