Site icon NTV Telugu

Janasena Social Audit: జనసేన సోషల్ ఆడిట్.. కొత్త తరహాలో వాస్తవాలు వెలికితీస్తాం..!

Janasena Social Audit

Janasena Social Audit

జనసేన పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టుబోతోంది.. త్వరలోనే సోషల్ ఆడిట్ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇది కొత్త తరహాలో వాస్తవాలను తెలియజేసేదిగా ఉంటుందని తెలిపారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. జగనన్న ఇళ్లు గుల్ల పథకం అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇంటి నిర్మాణంలో పేదలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది.. ఇసుకను వైసీపీ నాయకులు బ్లాకులో అమ్ముకుంటున్నారు.. టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగలేదు అని.. నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు.. పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానిది దోబూచులాటగా పేర్కొన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు అర్హులైన పేదలకు చెందడం లేదని విమర్శించారు.. దీని వెనుకున్న అసలు కారణాలను ప్రజలకు తెలిపేందుకు జనసేన పార్టీ నడుం బిగించింది.. క్షేత్ర స్థాయిలో ఇల్లు కట్టుకునేందుకు పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో బయట పెడతామన్నారు.

Read Also: Duvvada Srinivas: అచ్చెన్నాయుడు ఏ పార్టీకి ఓటేస్తావు.? ఏ పార్టీ నుంచి నామినేషన్ వేస్తావు..?

అయితే, దీనిని ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో సాయపడాలని సూచించారు మనోహర్‌.. జనసేన పార్టీ చేపట్టబోయే సోషల్ ఆడిట్ కొత్త తరహాలో వాస్తవాలను తెలియజేసేదిగా ఉంటుందని స్పష్టం చేసిన ఆయన.. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేలా సమగ్రంగా నివేదికలు తయారు చేస్తామన్నారు.. ఇళ్ల విషయంలోనూ మాట తప్పారని ఆరోపించిన ఆయన.. రాష్ట్రం మొత్తం మీద రైతుల నుంచి, ఇతర పద్ధతుల ద్వారా భారీగా భూమిని సేకరించి.. వాటిని అసంబద్ధ రీతిలో పట్టాలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు.. పేదలకు ఇల్లు స్వయంగా నిర్మిస్తామన్న హామీ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.. జూన్ 2022 నాటికి రాష్ట్రంలో ఇల్లు పూర్తి చేస్తామని లక్ష్యంతో మొదటి విడతలో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు.. కానీ, వాటిలో కేవలం 1,32,563 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయని.. అంటే కేవలం 8 శాతం మాత్రమే పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణం విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, కావాలని ఇసుక కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా వైసీపీ నాయకులు ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు నాదెండ్ల.. దీంతో పేదలకు ఇసుక దొరకడమే కష్టమైపోయిందన్న ఆయన… ఇసుక సమస్య వచ్చినప్పుడు ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పడం ప్రభుత్వం అలవాటు చేసుకుందని ఎద్దేవా చేశారు.. తాజాగా ఇసుక కాంట్రాక్ట్ విషయంలోనూ మార్పులు, చేర్పులకు దిగారని.. ఉన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.. అదే పద్ధతిని నిర్మాణరంగం విషయంలోనూ అమలు చేస్తోంది.. ఈ ప్రభుత్వానికి సమస్యలు వినే తీరిక లేదని.. ఇంకెందుకు స్పందన, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాలు అని నిలదీశారు.. ప్రజల్లోకి రావడానికి భయపడే ముఖ్యమంత్రి ఫోన్‌లో ప్రజల సమస్యలు వింటానంటే ప్రజలు నమ్ముతారా..? అని ఫైర్‌ అయ్యారు నాదెండ్ల మనోహర్‌.

Exit mobile version