బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రభావం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని తీరప్రాంతం అలజడిగా మారింది. ఈ నేపథ్యంలోనే తుఫాను కారణంగా సముద్రం ఒడ్డుకు బంగారు వర్ణం కలిగిన ఓ రథం తీరానికి కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి సముద్రం రేవుకు ఇది కొట్టుకురావడం వల్ల.. దీన్ని వీక్షించేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ఇలాంటిది ఆ ప్రాంతంలో మునుపెన్నడూ చూడలేదని వాళ్ళు చెప్తున్నారు. బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతున్న ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండొచ్చని స్థానిక ప్రజలు చెప్తున్నారు.
ఈ రథం గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై విచారణ చేపట్టారు. బహుశా ఇది మరో దేశం నుంచి వచ్చి ఉంటుందని నౌపాడా ఎస్సై తెలిపారు. ఈ రథం గురించి ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామని, ఉన్నతాధికారులు దీన్ని పరిశీలిస్తున్నారని ఆయనన్నారు. అయితే, ఆ రథం ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా అసని బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ఈ తుఫాను ప్రయాణిస్తోంది. రేపు సాయంత్రానికి వాయుగుండగా తుఫాను బలహీనపడనుంది.