MP Margani Bharath Says TDP Mahanadu Program Failed In Rajahmundry: ప్రజామన్ననలు పొందుతున్న వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా.. వైసీపీ శ్రేణులు గురువారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్ మాట్లాడుతూ.. సీఎం జగన్ నాలుగేళ్ళ పాలన దిగ్విజయంగా పూర్తయిందని, అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పేదల పాలిట పెన్నిధిగా, పెద్ద దిక్కుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందించారని చెప్పారు.
Vidadala Rajini: దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగింది
సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తోందని, ప్రజలంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మార్గాని భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లుగా సమర్థవంతమైన పాలన అందించి, ‘జయహో జగనన్నా’ అని ప్రతిఒక్కరి నుంచి అనిపించుకుంటున్న ఏకైకా సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. రాజమండ్రి నగరాన్ని నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దామని, మరెంతగానో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి.. తన డొల్లతనాన్ని బయట పెట్టుకుందని మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి.. కుర్చీని, పార్టీని చివరికి బ్యాంకు అకౌంట్లు కూడా లాక్కుని మానసికంగా, శారీరకంగా హింసించి వేధించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ మా దేవుడంటూ విగ్రహాలకు దండలు, శతజయంతులు నిర్వహించి.. ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారన్నారని విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ ఉన్నప్పుడు మహానాడు అంటే అదొక పెద్ద పండుగగా అందరూ భావించే వారని, కానీ చంద్రబాబు నిర్వహించే మహానాడు ఒక రాజకీయ స్వార్థం, వసూళ్ళ కోసం అన్నట్టుగా మారిందని మార్గాని భరత్ దుయ్యబట్టారు. మొన్న జరిగిన మహానాడుకు రాజమండ్రి నుండి కనీసం పదివేల మంది కూడా హాజరు కాలేదంటే.. ఆ పార్టీపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అర్థమవుతోందని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. తమని, తమ పార్టీని మనస్ఫూర్తిగా అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు.. ప్రజల వద్దకు ర్యాలీగా బయల్దేరి వెళుతున్నామని, వారితో కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటామని చెప్పారు.