నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. అయితే, ఇప్పుడు ఆనందయ్య మందు.. రాజకీయ విమర్శలకు దారి తీసింది.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది.. వెబ్‌సైట్‌లో పెట్టి.. ఆనందయ్య బందును అమ్మి కోట్ల రూపాయాలు కొల్లగొట్టాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారగా.. సోమిరెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. కరోనా మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదే తప్ప, ప్రభుత్వానికి గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధంలేదన్న ఆయన.. వస్తు రూపంలో ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం అందించాలన్న వారు గానీ వారు నేరుగా ఆనందయ్యకు తప్ప, మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇక, సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఒంటికాలితో లేచారు కాకాని.. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారన్న ఆయన.. అనందయ్య మందుకు పార్టీలకు సంబంధం లేకుండా చేస్తున్నాం.. పంపిణీతో మాకు సంబంధం లేదనే చెప్పాం… అన్ లైన్ ద్వారా పంపిణీ చేయాలి అధికారులతో కలసి నిర్ణయం తీసుకున్నాం.. కానీ, సోమిరెడ్డి దీనిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. సోమిరెడ్డి ది ఒక బతుకు… నాలుగు సార్లు ఓడిపోయినా సిగ్గులేదని మండిపడ్డ ఆయన.. శేశ్రిత టెక్నాలజీ పేరుతో సోమిరెడ్డి నాటకాలు ఆడుతున్నారని.. ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా? అంటూ సవాల్ చేశారు.. సోమిరెడ్డి లాంటి వెదవను చూడలేదు… దమ్ముంటే నిరూపించు… రా రా.. అంటూ బూతుపురానాన్ని ఎత్తుకున్నారు.. మొగాడివి అయితే రా… నిరూపించూ… అంతే కాని ఇంట్లో కూర్చుని చేతకాని మాటలు మాట్లాడకు అంటూ హితవుపలికారు.. దమ్ముంటే నిరూపించూ.. లేదంటే ఇంట్లో మూలన కూర్చో అంటూ ఎద్దేవా చేశారు.. అసలు శేశ్రిత టెక్నాలజీ ఎక్కడిది… ఎవరిదో.. ఆధారాలంటే చూపించూ లేదంటే నీమీదే కేసు పెడతానంటూ హెచ్చరించారు.. ఆనందయ్య మందు పంపిణీలో ప్రభుత్వానికి, వైకాపాకు సంబంధం లేదు.. సిట్టింగ్ జడ్జితో విచారించడానికి తాను సిద్దం… నువ్వు సిద్దమా? అని ప్రశ్నించారు కాకాని.. దీనిపై నేను ఇప్పుడే సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.