శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల్లో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామంలో వెలసిన, పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి శ్రీనివాస్ బుధవారం సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయద్వానాల, మధ్య చెట్టుకు గొడ్డలితో గాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు విజయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. అమ్మవారి సిరిమాను పండుగను, దానితోపాటుగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అమ్మవారు సిరిమాను రూపంలో తమ నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు. అమ్మవారు రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు రావాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులనాయుడు, తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి, ఆర్డిఓ డి.కీర్తి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమీషనర్ కె.శిరీష, డిఎఫ్ఓ కొండలరావు, డీఎస్పీ గోవిందరావు, తాహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ ఇతర పూజారులు, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు, సిరిమాను, ఇరుసుమాను చెట్ల దాతలైన రైతులు చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ, లోకవరపు సత్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.