తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఎన్టీవీతో మంత్రి రోజా స్పందించారు. రుయాసంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డ ఆమె.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో బాధ్యత అని.. కానీ ఎలా మిస్ అయిందో తెలియదన్నారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను పంపించి నివేదిక ఇవ్వమని చెప్పినట్లు మంత్రి రోజా వివరించారు. ఇప్పటికే ఈ ఘటనలో సీఎస్‌ఆర్‌ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు.
ఒక పనికి మాలిన వాడు చేసిన పనికి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎంత వరకు కరెక్ట్ అని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. వాళ్ల హయాంలో ఒక్క ప్రభుత్వాస్పత్రిలో కూడా కనీస సదుపాయాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది టీడీపి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఎక్కడ తప్పు జరుగుతుందా?? ఎక్కడకు వెళ్లి రాజకీయం చేద్దామా అని చూస్తుంటారని విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళలను ఏ రకంగా వేధించారో అందరికీ తెలుసన్నారు. టీడీపీ నేతలు ఉన్మాదులు అని.. తమ గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని రోజా అన్నారు. ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశా యాక్ట్‌ను ఉపయోగించుకోకపోవటం వల్లే కొంతమంది అమ్మాయిలపై అరాచకాలు జరుగుతున్నాయన్నారు. మహిళలందరూ చంద్రబాబును, టీడీపీని తరిమితరిమి కొడతారని రోజా మండిపడ్డారు.
Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు