Site icon NTV Telugu

Minister Roja: పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా సవాల్.. దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలి

Minister Roja

Minister Roja

Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతాడని.. నిన్న దొంగ సర్వేల గురించి చెప్పాడని ఆరోపించారు. ఇలాంటి సర్వేల వల్లే గతంలో బొక్కబోర్లా పడ్డాడని.. తమకు 45 సీట్లు వస్తాయంటే.. ఆయనకు 130 వస్తాయా అని రోజా ప్రశ్నించారు. పవన్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని.. 2019లో ఆయన మాటే శాసనం అన్నాడని.. అసెంబ్లీపై జనసేన జెండా ఎగరేస్తానని చెప్పాడని.. తీరా చూస్తే ప్రజలు శాసనసభలో కూడా అడుగు పెట్టనివ్వలేదని రోజా ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల పోటీచేసేందుకు జనసేనకు క్యాండెట్లు కూడా లేరన్నారు. ముందు కౌన్సిలర్లు, ఎంపీటీసీలుగా జనసేన నేతలను పవన్ గెలిపించుకోవాలని సూచించారు. పవన్‌ను చూసి తెలుగు ఇండస్ట్రీ హీరోలంతా తల దించుకుంటున్నారన్నారు. 2014లో టీడీపీకి , బీజేపీకి ఓట్లేయించి.. పవన్ ఏం సాధించారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని మంత్రి రోజా అభివర్ణించారు. గతంలో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోయాడో పవన్ చెప్పాలన్నారు. విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా సినిమా షూటింగ్‌లు చేసుకున్నావా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే 175 సీట్లలో జనసేన పోటీ చేయాలని.. ఇదే పవన్‌కు తన ఛాలెంజ్ అని మంత్రి రోజా సవాల్ విసిరారు. లోకేష్ పాదయాత్ర పోస్ట్ పోన్ చేయగానే పవన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడని.. దీన్ని బట్టి అర్ధమవుతోంది లోకేష్ , పవన్ ఒక్కటే అని అర్ధమవుతోందన్నారు. ఇప్పటికైనా పవన్ సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని మంత్రి రోజా హితవు పలికారు.

Read Also:వావ్‌.. ఇది చూశారా.. స‌న్ గ్లాసెస్ క‌మ్ ఇయ‌ర్‌ఫోన్స్‌..

పందులన్నీ ఒకచోట చేరి జగనన్నను ఓడిస్తామంటున్నాయని.. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగనన్న అడ్డా అని రోజా అన్నారు. లోకేష్ లాంటి బుర్రతక్కువోడు పుట్టాడని చంద్రబాబు రోజూ ఏడుస్తున్నాడని.. అధికార దాహంతోనే లోకేష్‌ను చంద్రబాబు మంత్రి చేశాడని రోజా విమర్శలు చేశారు. ఎద్దు ఎద్దుల బండి ఎక్కొస్తుంటే అందరూ నవ్వుతున్నారని.. టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు రైతు ద్రోహి అని.. రైతులకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రైతులకు చేసింది శూన్యమన్నారు. వైఎస్ జగన్‌కు మూడున్నర లక్షల కోట్లు అప్పులను చంద్రబాబు మిగిల్చి పోయాడన్నారు. రైతులకు అండగా నిలబడింది వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగ వృద్ధి రేటు పెరిగిందని.. టీడీపీ మూర్ఖులు ఇది తెలుసుకోవాలని మంత్రి రోజా సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేసిందో రైతులు తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీలో టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని.. చంద్రబాబు వంటి దరిద్రుడు, నికృష్టుడు మరొకరు లేరని రోజా మండిపడ్డారు. కరువుకు గడ్డం పెడితే అది చంద్రబాబులా ఉంటుందన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని చెప్పారు. వరుణుడు వైఎస్ఆర్ కుంటుంబంలో సభ్యుడిగా మారాడని.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రిజర్వాయర్లన్నీ జలకళ సంతరించుకున్నాయన్నారు. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే చంద్రబాబు సభకు రావాలని.. సరైన ఫార్మాట్‌లో వస్తే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చిస్తామని మంత్రి రోజా తెలిపారు.

Exit mobile version