చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యెం మండలంలో ఆదివారం నాడు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు.
కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం పాలయ్యారన్నారు. అవన్నీ గమనించి పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కవని చంద్రబాబు ఆలోచనలో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనైతిక కలయికలో ఉన్నారని.. ఇప్పుడు నైతికంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకున్నా.. వైఎస్ జగన్ సారథ్యంలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి గతంలో వచ్చిన ఫలితాల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.
ఎన్నికల్లో గెలవలేం.. ఓడిపోతామని ఏ నాయకుడు చెప్పడని.. అందుకే చంద్రబాబు వాళ్ల కార్యకర్తలకు గెలుపుపై భరోసా ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అసలు ఏం చేశారని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కేవలం సీఎం జగన్, వైసీపీని తిట్టడమే టీడీపీ ఎన్నికల నినాదంగా, అజెండాగా కనిపిస్తోందన్నారు. దానికి పచ్చ మీడియా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కుప్పంలో ఇల్లు కట్టాలని చంద్రబాబు ఆలోచన చేయలేదని.. ఇప్పుడు ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తున్నారని.. రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని సమాచారం అందుతోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేసినా చేయకపోయినా నైతికంగా ఆయన ఓడినట్లేనని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ చంద్రబాబు పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించానని.. సీఎం జగన్ కూడా సమీక్షలు చేపట్టారని.. ఏపీలో మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం కోసం తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్ కోతలు లేవని.. రైతులకు కూడా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు కొంత తప్పవన్నారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 30 శాతం పెరిగిందన్నారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
Chandra Babu: జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదా?
