Karumuri Nageswararao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పవన్ కళ్యాణ్ కాల్షీట్ ముగిసిందని.. అందుకే హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని.. మంత్రి రోజా వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. యువతకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి దాడులు చేయమని రెచ్చగొడతారా అంటూ మండిపడ్డారు. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అంటూ ఫైరయ్యారు.
ఇప్పటి వరకు నిర్వహించిన జనవాణి కార్యక్రమాలను ప్రభుత్వం సహకరించకుండానే పవన్ కళ్యాణ్ ఎలా నిర్వహించారా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. తాము ప్రజామద్దతుతో ఎన్నికయ్యామని.. తమను కొడితే రాష్ట్ర ప్రజలను కొట్టినట్లేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఎంతమంది తాట తీశారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రాష్ట్ర ప్రజలపైనే దాడి చేసే స్థాయికి వెళ్లారని చురకలు అంటించారు. ఇప్పటివరకు ఉన్న ముసుగు తొలగిందని.. ప్యాకేజీ, దత్తపుత్రుడు అన్న మాటలను పవన్ నిజమే అని స్పష్టం చేశారని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
అటు వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి విడదల రజినీ ఆరోపించారు. పవన్ మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఒకేసారి రెండు నియోజవర్గాల్లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే ఉంటుందని.. ఈ విషయం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కూడా అర్ధమైందని మంత్రి విడదల రజినీ తెలిపారు.