Site icon NTV Telugu

Gudivada Amarnath: అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని.. దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. వారిని తరిమికొట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. తక్షణమే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని కావాలనే ఆకాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. భూములను కాపాడుకునేందుకు, రేట్లు పెరిగేందుకే అమరావతి రైతులు తాపత్రయపడుతున్నారని విమర్శలు చేశారు. తాము మాత్రం అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

Read Also: GST Returns: సెప్టెంబర్ జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలుచేయలేదా?. అయితే ఈ వార్త మీకోసమే

అటు ఇదే సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖకు చేరుకున్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర జరిగితే ఆ ప్రాంతంలో బంద్ చేయాలన్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి బొత్స ఆరోపించారు. భవిష్యత్‌ను చంద్రబాబు అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి చేయ్యాలంటే 6 నుండి 7 లక్షల కోట్లు అవుతుందని.. అక్కడ 110 నుండి 135 అడుగుల వేస్తేనే పునాదులు నిలబడతాయని బొత్స అన్నారు. ప్రజా ధనాన్ని గోతులు, గుంతల్లో ఏ విధంగా పోస్తామని ప్రశ్నించారు. ఇది అబద్ధం అని చంద్రబాబు, టీడీపీ నేతలు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపిస్తే తాను మంత్రి పదవికి అనర్హుడిగా నిర్ణయించుకుంటానని మంత్రి బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబుకు మద్దతుగానే పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి బీభత్సం సృష్టించి వెళ్లారని విమర్శించారు. సినిమా యాక్టర్ వస్తే జనం చూస్తానికి వస్తారని.. పవన్ కాకుండా ఎవరు వచ్చినా జనం వస్తారని బొత్స చెప్పారు.

Exit mobile version