ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీ పర్యటనకు రానున్నారు.. విశాఖలో ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. బీజేపీ-జనసేన పొత్తుతో పాటు మరికొన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. పవన్ మరింత దూకుడు చూపించే స్టెప్ తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది.. అయితే, ప్రధాని మోడీ-పవన్ కల్యాణ్ సమావేశాన్ని లైట్‌గా తీసుకుంటుంది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ పెద్దగా చుడాల్సిన, చర్చచేయాల్సిన పనిలేదని కొట్టిపారేశారు.. గత కొంతకాలంగా బీజేపీ, జనసేన పొత్తు ఉంది.. అయినా.. రాష్ట్రంలో జనసేనకు, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని సెటైర్లు వేశారు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన పుర్తిగా ప్రభుత్వ కార్యక్రమం… గవర్నర్, సీఎం స్వాగతం పలుకుతారన్న ఆయన.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.. రాష్ర్టం తరపున గౌరవించాలనే పెద్ద ఎత్తున మూడు లక్షల మందితో జనసమీకరణ చేస్తున్నామని వెల్లడించారు.
ఇక, భారతీయ జనతా పార్టీ ఇచ్చే రోడ్ మ్యాప్‌లోకి తెలుగు దేశం పార్టీని ఎలా తీసుకెళ్లాలని భావిస్తున్నారు? అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.. జనసేన అధినేత పాత్ర మాత్రం టీడీపీనీ, బీజేపీని కలిపే ప్రయత్నమేనని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలు , స్ర్కిప్ట్ లపైనే పవన్ కల్యాణ్ ఆలోచన ఉంది అంటూ మండిపడ్డారు.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగాలని , ఆలోచించాలని కోరుతున్నానంటూ సలహాఇచ్చారు.. విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు భావిస్తున్నారు, దానిని పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, రెండో రోజుల విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీతో ఇవాళ రాత్రి సమావేశం కానున్నారు పవన్.. సాయంత్రం 5 గంటలకు విశాఖకు చేరుకోనున్న పవన్.. రాత్రి 8.30 గంటలకు మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల వైజాగ్ పర్యటనలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పవన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..