Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వాతంత్ర్య స్ఫూర్తితో జనసేన స్థాపించలేదని ఆరోపించారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కొమ్ముకాయడానికే పార్టీ స్థాపించాడని.. ప్రస్తుతం ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ విచిత్రమైన రాజకీయ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు ఉన్నాయని చురకలు అంటించారు. పవన్ అసలు నీకు స్వాతంత్య్రం ఉందా అని ప్రశ్నించారు. పవన్‌కు దమ్ముంటే 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. పవన్ రాజకీయం ప్రజలకు రుచించడం లేదని ఎద్దేవా చేశారు.
Read Also: Bandla Ganesh: రంభల రాంబాబు గారికి త్వరలో మా సార్ సమాధానం చెప్తారు
ఈరోజు ఏ సర్వే చూసినా వైసీపీదే విజయం అని చెబుతున్నాయని.. సర్వేల్లో ప్రజల పల్స్ చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వణికిపోతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఆయనేమో టీడీపీ వైపు చూస్తాడని కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడులు సృష్టించేందుకే పవన్, చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్‌పై ఛాలెంజ్‌లు చేయడం సిగ్గుచేటన్నారు. కాపులెవరూ పవన్‌ను నమ్మే పరిస్ధితిలో లేరన్నారు. పవన్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే అని కాపులకు తెలుసన్నారు. తుని ఘటనలో కాపులను అనేక చిత్ర హింసలకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మళ్ళీ కాపులను తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని.. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ ఉన్నాడని పేర్కొన్నారు.
