కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్, సీఎంలు జగన్, కేసీఆర్‌కి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబే విలన్‌గా పేర్కొన్న ఆయన.. ఈ ఘటనలో కుట్రకోణం ఉందన్నారు. తుని ఘటన జరగడానికి కారణం చంద్రబాబే.. ఈ రోజు అమలాపురంలో విధ్వంసానికి కూడా చంద్రబాబే కారణం అన్నారు.
Read Also: GVL: అంబేద్కర్‌పై ప్రేమ ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా..?
ఇక, తుని ఘటన ఏ విధంగా ప్రీ ప్లాన్‌గా చేశారో… ఈ రోజు అమలాపురంలో కూడా ప్రీ ప్లాన్డ్ గానే మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారని మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా.. ప్రశాంతమైన కోనసీమ వాతావరణాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెడగొడుతున్నారని ఆరోపించిన ఆయన.. అంబేద్కర్ జిల్లాగా మార్చాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోరలేదా? అని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడం చాలా దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు..వ్యవస్ధల మీద భయం లేకపోవడం వల్లే చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అమలాపురం ఘటనలో ప్రభుత్వం సమన్వయంగానే వ్యవహరించిందన్నారు మంత్రి దాడిశెట్టి.. నిన్నటి ఘటనలో జనసేన కార్యకర్తలే పాల్గొన్నారని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సాయంతోనే ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారని.. తనకి ఆదరణ లేదని అసూయతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, మంగళవారం ఉద్రిక్తంగా మారిన అమలాపురం.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. మరోసారి ఆందోళనలు, నిరసనలకు అవకాశం ఉండడంతో.. అప్రమత్తమైన పోలీసులు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు.