వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీపై చంద్రబాబు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని. . ప్రజలంతా క్విట్ చంద్రబాబు, క్విట్ తెలుగు దేశం అంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ జవసత్వాలు అయిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనది అనుకున్న ఒక్క కార్యక్రమమైనా ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఉంటుందని బొత్స ఎద్దేవా చేశారు.
చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఎందుకు చేయలేకపోయారని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో క్యాష్ పార్టీలు, పెట్టుబడిదారులకే రాజ్యసభ పదవులు ఇచ్చారని.. ఈ విషయంలో చంద్రబాబు మాట్లాడటానికి సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. అమలాపురం కుట్రలో ఒకట్రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయని బొత్స హెచ్చరించారు. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం అని.. జిల్లా పేర్ల మార్పుకు 30 రోజుల సమయం ఇవ్వటం నిబంధన అని.. ఏమీ తెలియకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. తుని ఘటనలో తన పేరు, సి.రామచంద్రయ్య, ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు పేర్లు ఛార్జిషీట్‌లో ఉన్నాయని.. ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో వైసీపీ నేతలా అని బొత్స నిలదీశారు. కాపు ఉద్యమాన్ని కించ పరుస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు పవన్ కళ్యాణ్‌ను క్షమించరన్నారు.