NTV Telugu Site icon

Botsa Satyanarayana: విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు నిధుల విభజన కూడా జరగాలన్నారు. ఉద్యమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ కారణాలతో విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని మంత్రి బొత్స ఆరోపించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దో వ్యతిరేకించేవారందరూ చెప్పాలన్నారు. అమరావతికి రాజధాని వచ్చినప్పుడు తాము వ్యతిరేకించలేదని.. మరి విశాఖకు అవకాశం వస్తే ఎందుకు వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.

Read Also: YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి

మరోవైపు వికేంద్రీకరణ అంశంపై కాకినాడ వేదికగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కన్నబాబు కూడా స్పందించారు. వికేంద్రీకరణ అనేది తమ ప్రభుత్వ నినాదం అని.. టీడీపీ వాళ్లు కోరుకున్న అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటం లేదని వాళ్ల బాధగా కనిపిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును లేపడానికి జాకీలు వేసి జగన్‌పై బురద చల్లుతున్నారు. ఒకవైపు చంద్రబాబుకు భజన చేసి.. మరోవైపు జగన్‌పై విషం చిమ్ముతున్నారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుబాటుతనం పవన్ కళ్యాణ్‌కు కనిపించదా అని కన్నబాబు ప్రశ్నించారు. రాజధానుల వికేంద్రీకరణలో అమరావతి కూడా ఉండాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.