మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం చట్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో శివరామకృష్ణ కమిటీ వేసి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని బొత్స ఆరోపించారు. రాజధానిపై ఆనాటి ప్రకటన ఏదైనా పార్లమెంట్‌కు పంపలేదు కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధాని అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారంలో చట్టబద్ధంగా వ్యవహరించలేదన్నారు. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం తమ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టిందన్నారు.
శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుందని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీపీ నేతలకు ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారని బొత్స ఆరోపించారు .ప్రజల కోసం దీర్ఘకాలిక నిర్ణయాలను తీసుకునే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు.
