జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్‌కు అలవాటు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికల్లో పవన్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడుతారని విమర్శించిన ఆయన.. అప్పుడు తిట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పేదలకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ఇస్తుందని పవన్ గమనించాలని సూచించారు. గతంలో ఏ ప్రభుత్వం పనిచేయని విధంగా పేదలకు మా ప్రభుత్వం అండగా ఉందన్నారు మంత్రి బాలినేని.
Read Also: COVID 19: కేంద్రం హెచ్చరికలు.. ప్రజల్లో మళ్లీ ఆందోళన..!
ఇక, పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి ఇస్తానంటే పొత్తు పెట్టుకున్నా అర్థం ఉంటుంది.. కానీ, చంద్రబాబును సీఎంను చేయటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని విమర్శించారు మంత్రి బాలినేని.. ఎవరినో ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర సమస్యలు తీరుస్తానని ఎలా చెబుతారుని ప్రశ్నించిన ఆయన.. సొంత పార్టీ పెట్టుకుని పవన్.. బీజేపీని రోడ్డు మ్యాప్ అడగటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే భాధ్యతను సీఎం జగన్ మంత్రులపై పెట్టారని.. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం పార్టీ నడుచుకుంటుందని వెల్లడించారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.