Site icon NTV Telugu

Ambati Ramababu: పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు.. ‘మోదీతో మీటింగ్.. బాబుతో డేటింగ్’

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Ramababu: విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మోదీతో పవన్ సమావేశం ముగిసింది. అయితే ఈ భేటీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘మోదీతో మీటింగు.. బాబుతో డేటింగ్’ అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ పట్ల జనసేన అభిమానులు కూడా మంత్రి అంబటి రాంబాబుకు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.

అటు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మోదీ, పవన్ కళ్యాణ్ భేటీపై స్పందించారు. అయితే ఇదేమంత చర్చనీయాంశం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయల్లో ఇలాంటి భేటీలు సహజమేనని అభిప్రాయపడ్డారు. నేతలు ఒకరినొకరు కలుసుకోవడంలో ఆశ్చర్యమేముందని, రాజకీయాల్లో ఇవి రొటీన్ అని అన్నారు. మోదీతో పవన్ సమావేశమైతే తామెందుకు స్పందించాలని బొత్స ప్రశ్నించారు. ఈ భేటీని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కాగా గతంలో ఢిల్లీలో మోదీని పవన్ కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదంటూ మంత్రి బొత్సను మీడియా ప్రతినిధులు అడగ్గా.. అవన్నీ ఆయా పార్టీల అంతర్గత వ్యవహారాలు అని, వాటిపై తామెలా స్పందిస్తామని బొత్స బదులిచ్చారు. తానేమైనా వారి పార్టీకి సంబంధించిన వాడినా అంటూ నిలదీశారు. అలాంటి విషయాలపై తాను మాట్లాడనని కరాఖండీగా చెప్పేశారు.

Read Also: ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ వీరే.. గుర్తున్నారా

Exit mobile version