ఏపీలో అన్ని ఛార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాదుడులో మరో బాదుడు వచ్చి చేరింది. మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపుతో అల్లాడుతున్న ప్రజలపై సర్కార్ అదనుపు బాదుడు మోపుతుంది. పెంచిన మీ సేవ సర్వీసు ఛార్జీలు అమలులోకి వచ్చాయి.
మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను ప్రభుత్వం తాజాగా పెంచింది. కేటగిరి – ఎ, కేటగిరి – బి కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను 5 రూపాయల మేర పెంచింది. దీని ద్వారా ఏడాదికి సుమారు 60 కోట్ల భారం సామాన్య ప్రజలపై పడనుంది. ఇప్పటికే వివిధ ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ పెంపుతో వారిపై సర్కార్ అదనపు బాదుడుపై జనం మండిపడుతున్నారు. మీ సేవ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సుమారు 512 రకాల సేవలు అందుతాయి. దీనికి సర్వీసు ఛార్జీ కింద ఎ కేటగిరి కింద 35, బి కేటగిరి కింద 45 రూపాయల వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇందులో నిర్వాహకులకు చెల్లించే మొత్తం పోనూ… మిగిలిన మొత్తం ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. నిన్నటి నుంచి సర్వీసు ఛార్జీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులకు సంబంధిత శాఖ సమాచారం పంపింది.
ఇప్పటికే ధరల భారం భరించలేని సామాన్యులు రకరకాలుగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీ సేవ ఛార్జీలు సైతం పెంచడం అంటే ఎక్కడ మరో శ్రీలంక అవుతుందా అన్నట్లుంది ఏపీ పరిస్థితి.పోను పోను ఉన్న జీతాలకు అయ్యే ఖర్చుకు సంబంధం లేకుండా పోయేలా ఉంది. నిత్యావసరాలు సైతం సామాన్యులు కొనలేని విధంగా మారాయి. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రజలపై అదనపు భారం మోపుతుంటే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పటికైనా పెంచే దిశగా కాకుండా ధరలు తగ్గించే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.
https://ntvtelugu.com/leaders-fight-in-dwarakatirumala-ysrcp/