టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఊరట లభించింది. రాజాం సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జిల న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి నెలా రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పొందూరు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ క్రమంలో తమ్మినేని సీతారాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్. భవిష్యత్తులో ఆమదాలవలస నడిరోడ్డుపై తమ్మినేనిని గుడ్డలూడదీసి పరిగెట్టిస్తానని ఆయన పేర్కొన్నారు. తమ్మినేని ఇంట్లో ఓ ఊరకుక్క అనవసరంగా మొరుగుతోందని, పోలీసులు కూడా ఆ ఊరకుక్క మాటలు విని తప్పుడు దారి పడుతున్నారని అన్నారు. డమ్మాబుస్సుల సీతారాం అరాచకాలను అడ్డుకోవడానికే టీడీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిందని, ఆమదాలవలసలో అబ్బా కొడుకుల దురాగతాలను అంతమొందించడం మా లక్ష్యం అని అన్నారు. ఆమదాలవలసను అన్ని రకాలుగా దోచుకుంటున్నారన్న ఆయన ఉడత ఊపులకు భయపడే నైజం నాది కాదని అన్నారు. నా పై తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టనన్న ఆయన పోలీసు వ్యవస్థ పై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరినీ విడిచిపెట్టను అని ఆయన అన్నారు. పోస్టింగ్ ల కోసం కక్కుర్తి పడి నా పై కేసులు పెట్టొద్దని ఎస్పీని కోరుతున్నానని ఆయన అన్నారు.