NTV Telugu Site icon

Kidney Racket Scam: కలకలం రేపుతోన్న కిడ్నీ మాఫియా.. మూలాలపై పోలీసుల ఫోకస్

Kidney Racket

Kidney Racket

Kidney Racket Scam: గుంటూరులో కిడ్నీ మాఫియా చేతిలో మోసపోయిన మధుబాబు వ్యవహారంపై బెజవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. కేసు గుంటూరు పోలీసులు నమోదు చేసినప్పటికీ వ్యవహారం అంతా బెజవాడ కేంద్రంగా జరగటంతో పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా కిడ్నీ అమ్మకాలకు సంబంధించిన మధ్యవర్తుల వ్యవహారంపై భవానీపురం పోలీసులు రెండు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మధ్యవర్తులను అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత స్వర ఆసుపత్రిలో కిడ్నీ అమ్మకానికి సంబంధించిన ఘటన కూడా కలకలం రేపింది. ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ బెజవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ కార్యకలాపాలు గుంటూరులో బయటపడటంతో బెజవాడ పోలీసులు అప్రమత్తయ్యారు.

Read Also: AP Crime: కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య.. అసలు విషయం తెలిస్తే షాకే..

గుంటూరుకు చెందిన మధుబాబు కిడ్నీని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన గార్లపాటి వెంకటస్వామికి గత నెల జూన్ లో విజయవాడ విజయా ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా మార్పిడి చేశారు. వీరిద్దరు బంధువులు అంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి వాటి సాయంతో కిడ్నీ మార్పిడి చేయించారు. మధ్య వర్తులుగా ఖాదర్ బాషా, వెంకట్ లు వ్యవహరించినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరి వ్యవహారాల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాదర్ ఇప్పటికే పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంకట్ ఆచూకీ తెలుసుకుని విచారణ చేయనున్నారు. కిడ్నీమార్పిడి వ్యవహారంలో ఈ ఇద్దరికీ 3 లక్షల రూపాయల వరకు ఇచ్చినట్టు ప్రాధమిక విచారణలో పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీంతో గతంలో ఈ ఇద్దరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read Also: Sikhs For Justice: ఖలిస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’’పై మరో 5 ఏళ్లు బ్యాన్..

ఆపరేషన్ చేసిన విజయా ఆసుపత్రిపై గతంలో వచ్చిన ఫిర్యాదులను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. నగరంలో అనేక మంది కిడ్నీ మాఫియా రాకెట్ లో మధ్యవర్తులగా వ్యవహరిస్తూ ప్రధాన ఆసుపత్రులకు ఏజంట్లుగా ఉండి కిడ్నీలను మార్కెటింగ్ చేస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. విజయా ఆసుపత్రి, డాక్టర్ శరత్ పై కూడా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎడమ కిడ్నీ ఇస్తానంటే కుడి కిడ్నీ తొలగించారని, 30 లక్షలు ఇస్తానని మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నీ తీసుకున్న వెంకటస్వామిని కూడా పోలీసులు విచారణ జరిపి ఆర్థిక లావాదేవీలపై నివేదిక సిద్ధం చేయనన్నట్టు తెలిసింది. కిడ్నీ మాఫియా ఏజంట్లుకు అండగా ఉంటున్న ఆసుపత్రుల వివరాలను కూడా తీసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. కిడ్నీ మాఫియా విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో గుంటూరు, విజయవాడ పోలీసులు సమన్వయంతో కేసు విచారణ చేపట్టారు.