Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది. కృష్ణా జిల్లా నుంచి బెంగళూరుకు వచ్చిన కుటుంబం కారులో వెళ్తుండగా K.R. సర్కిల్ సమీపంలోని అండర్ పాస్ వద్ద కారులో నీళ్లు చేరి మునిగిపోయింది. నీరు కారులోకి వెళ్తున్న విషయాన్ని గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు నీటిలో చిక్కుకున్న ఆరుగురిలో ఐదుగురిని సురక్షితంగా రక్షించారు. అయితే నీటిని మింగిన భానురేఖ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సమాచారం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య బాధితురాలి బంధువులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు సిద్ధరామయ్య ఆదేశించారు. మృతురాలు భానురేఖ కృష్ణా జిల్లా తేలుప్రోలుకు చెందినవారు. ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
Read Also: Microsoft: జీతం పెరగకున్నా.. మీ ఆదాయాన్ని ఇలా పెంచుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ సీఎంఓ సూచన
బెంగళూర్ నగరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశాన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ఒక్కసారిగి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన ప్రారంభమైంది. గంటన్నర పాటు కుండపోతగా వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. అండర్ పాస్ ల వద్ద నీరు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం కారణంగా విదానసౌద, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రేస్ కోర్స్ రోడ్డులో ఓ భారీ వృక్షం కారుపై పడింది. కారులో ప్రయాణిస్తున్నవారికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వర్షం బీభత్స సమాచారం అందుకున్న సీఎం సిద్దరామయ్య వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.