సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. క్రాప్ హాలీడేకి సిద్ధమవుతున్న రైతుల ఆలోచన ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. మంత్రి విశ్వరూప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలీడే రైతులపై రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన ఆరోపణలను కోనసీమ రైతు పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండించింది సమితి ప్రతినిధులు మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడారు.
క్రాప్ హాలీడే రైతులు టీడీపీ కి చెందిన వారని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. మంత్రి గారు తమ ఇంటిలిజెన్స్ శాఖ వారిని పంపి ఇక్కడ ఏ రైతులు ఉన్నారో పరిశీలించు కోవచ్చన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని తొలకరి పంట గిట్టుబాటుకాక క్రాప్ హాలీడే పాటిస్తున్నామని తెలిపారు. రైతులకు పార్టీలు ఉండవని సాగు సమస్యలపై తామంతా కలసి పోరాడుతున్నామని పేర్కొన్నారు. రైతులలో అన్ని పార్టీల సానుభూతి పరులు ఉన్నారని…గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతులను కనీసం సమావేశాలు కూడా పెట్టుకోనివ్వకుండా ఆంక్షలు విధించిందని వారు గుర్తు చేశారు. తొలకరి పంట నష్టం ఎలా వస్తోందో తెలుసుకోవాలంటే ప్రభుత్వమే స్వయంగా తమ అధికారులతో ఒక 10 ఎకరాలలో సాగు చేయించాలని కోరారు.
తొలకరి పంట గిట్టుబాటు కాక స్వచ్చందంగా తాము పంట విరామం పాటిస్తున్నామని… వచ్చే రబీలో వరి పంట సాగు చేస్తామని కోనసీమ రైతు పరిరక్షణ సమితి నేత దామిశెట్టి చంటి, రాంబాల బోసు అన్నారు. ప్రభుత్వం రైతు సమస్యల్ని పట్టించుకోవడం లేదని కోనసీమ రైతు పరిరక్షణ సమితి, ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, రైతు ప్రతినిధులు అంటున్నారు. వరిసాగు గిట్టుబాటు కాక 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి అందరి దృష్టిలో పడ్డారు. అప్పట్లో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. మళ్ళీ ఇప్పుడు క్రాప్ హాలీడే అంశంపై రాజకీయపార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Crop Holiday: గిట్టుబాటు ఎండమావి.. క్రాప్ హాలీడేకి మొగ్గు