NTV Telugu Site icon

Amit Shah and Junior NTR Meet: అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీ… కొత్త చర్చకు తెరలేపిన కొడాలి నాని..!

Kodali Nani

Kodali Nani

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. కొత్త చర్చకు తెరలేపారు.. ఆదివారం రోజు తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్‌షా.. ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. మునుగోడు బహిరంగ సభలో పాల్గొన్న అమిత్‌షా.. ఆ తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌కు చేరుకున్న తర్వాత.. ఎన్టీఆర్‌ ఆయనతో సమావేశం అయ్యారు.. ఇద్దరి మధ్య జరిగిన ఈ డిన్నర్‌ మీటింగ్‌.. దాదాపు అరగంట పాటు జరిగింది.. అయితే, గతంలో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్‌.. ఇప్పుడు మాత్రం రాజకీయాలతో దూరంగా ఉంటున్నారు.. షా భేటీతో.. ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారా? పాన్‌ ఇండియా స్టార్‌ అయిన ఎన్టీఆర్‌.. బీజేపీ కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారా? అనే చర్చ మొదలైంది.. ఇదే సమయంలో.. ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి..

Read Also: NTR: మొన్న వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు వంగివంగి దండాలు పెడుతున్నాడు.. రాజకీయమా..?

అయితే, కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని పేర్కొన్న ఆయన.. భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నానన్నారు.. మోడీ, అమిత్‌షా ఎప్పుడూ వివిధ రాష్ట్రాల్లో బీజేపీని ఎలా విస్తరించాలి.. ఎలా అధికారంలోకి తీసుకురావాలి.. లేదా ప్రతిపక్షంగా ఉంచాలి అనేదానిపైనే ఆలోచిస్తారని.. దానిని దృష్టిలో పెట్టుకునే వారి మీటింగ్‌లు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే అమిత్ షా ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు కొడాలి నాని.. అంతే కాదు, పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందన్నారు. జూనియర్‌ కొత్త నటుడేమీ కాదు.. 25కు పైగా సినిమాల్లో నటించారు.. ఇప్పటికే ఎన్టీఆర్‌ చాలా సినిమాలు హిందీలో డబ్‌ అయ్యాయి.. ఎప్పుడో.. ఎన్టీఆర్‌ సినిమాలను అమిత్‌షా చూసి ఉంటారన్నారు. దీనికి రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన నటన బాగుందో.. స్వీట్లు బాగున్నాయోనని సమావేశం అయ్యారంటే.. తాను నమ్మనన్నారు. ఇదే సమయంలో.. చంద్రబాబుతో ప్రయోజనం లేదని ఢిల్లీలో నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదని చెప్పుకొచ్చారు కొడాలి నాని. అయితే, బీజేపీ నేతలు మాత్రం.. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేస్తున్నారు.. ఈ సమావేశంలో కేవలం సినిమాల గురించి, సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి చర్చ సాగిందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి డిన్నర్ మీట్ అవ్వాలని అమిత్ షానే కోరారని చెబుతున్నారు.

కానీ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌లో మంచి ఇమేజ్‌ ఉన్న హీరోల్లో తాను ఒకరు.. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉన్న నటుడు.. ఏ అంశమైనా స్పష్టంగా మాట్లాడే నేర్పరి.. ఆయన బీజేపీ కోసం రంగంలోకి దిగుతారా? అనే చర్చ మొదలైంది. కాగా, గతంలోనే పలు సందర్భాల్లో రాజకీయాలు, పార్టీ మార్పుపై ఎన్టీఆర్‌కు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.. వాటిపై ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు.. నా కట్టే కాలే వరకు.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని పలు సందర్భాల్లో బహిరంగంగానే తన అభిప్రాయాన్ని తెలిపారు ఎన్టీఆర్‌.. మరి, ఇప్పుడు అమిత్‌షాతో భేటీ తర్వాత ఆయన అభిప్రాయం మారుతుందా? అనేది వేచిచూడాల్సిన విషయమే.. ఏదమైనా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తేనే.. దానిపై క్లారిటీ వస్తుంది.