Site icon NTV Telugu

Kodali Nani: ఒక్క పేదవాడు అడిగినా, నేను పోటీ చేయను

Kodali Nani On Ysrcp

Kodali Nani On Ysrcp

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళిన కొందరు అధికార పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. వివిధ అంశాలపై ప్రజలు నేతల్ని నిలదీస్తున్నారు. ఉపాధిహామీ పనుల కూలీలు రాలేదని కొందరు, రోడ్డు వేయించమని మరికొందరు నేతలపై తిరుగుబాటుకి దిగారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదంటూ మీడియా ముందుకొచ్చారు.

జగన్ బతికున్నంత కాలం ఆయన సీఎంగానే ఉండాలని, ఆయన కోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని నాని పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయ్యుండకపోతే, పేదలు ఇళ్లు లేక అల్లాడిపోతుండే వారన్నారు. డిసెంబర్ 21న జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా, 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. గుడివాడ 22వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో నాని మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

పనీపాట లేకే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, తమ పార్టీకి ప్రజా అనుకూల ఓటు మాత్రమే ఉందని చెప్పారు. తమ 151 సీట్లు తమకు మళ్లీ పక్కాగా వస్తాయని నమ్మకంగా చెప్పిన కొడాలి నాని.. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని వ్యాఖ్యానించారు.

Exit mobile version