Kodali Nani: మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూ వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని చెప్పారు. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గత టీడీపీ హయాంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని కొడాలి నాని గుర్తుచేశారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదనడం సరికాదన్నారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పదవులు కేటాయించాలని అభిప్రాయపడ్డారు. కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందే ఉందని తెలిపారు.
మహానేత ఎన్టీఆర్‌ను కమ్మ వర్గానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న తేవడంలో విఫలమైన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. రాష్ట్రంలోని 105 కులాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా పది లేదా పన్నెండు కులాలకే మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇప్పటివరకు 90 బీసీ కులాల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కాయో చెప్పాలన్నారు.
Read Also: Andhra Pradesh: సీపీఎస్ అంశంపై కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులు
మరోవైపు తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తప్పుబట్టారు. వాగే నోరు, తిరిగే కాలు ఆగదన్నట్లుగా తమ నాన్నను ఆపలేమన్నారు. తన తండ్రి నోరు చాలా ప్రమాదకరమని ఆరోపించారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని పేర్కొన్నారు. తన తండ్రి విషయాన్ని వైపీపీ కార్యకర్తలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. ఎప్పుడు, ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమని స్పష్టం చేశారు. పాత కాలంలో అంబాసిడర్ బావుందని, ఇప్పుడు కూడా అదే బావుంటుందని అనలేమన్నారు.
