Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా 15 గిరిజన గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితులు ఉన్నారని స్థానిక అధికారులు చెప్తున్నారు. దీంతో భూములు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడేందుకు తాగునీరే కారణమని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. ఇక్కడి తాగునీటిలో అధికంగా ఫ్లోరైడ్, సిలికాన్ ఉంటున్నాయని.. ఈ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంకర్‌లతో తాగునీరు సరఫరా చేసేవాళ్లు అని.. కానీ ఇప్పుడు ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిచిపోయిందని.. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. తమకు తాగునీటి కోసం కృష్ణా జలాలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కోసం కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టుకు రూ.38 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో చాలా మంది గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
Read Also: Party Funds: గుప్త విరాళాల్లో వైసీపీ టాప్.. పార్టీల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్
అటు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులు చనిపోతే రూ.10వేలు పరిహారం ఇచ్చేవాళ్లు అని.. కానీ ఇప్పుడు వాటిని ఆపేశారని.. డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రం రూ.10వేల పరిహారం కొనసాగుతోందని స్థానికులు వివరించారు. అటు కిడ్నీ బాధితులకు గతంలో ఫించన్ ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు బాధితులు పెరిగినా కొత్త వారికి ఫించన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా ఎ.కొండూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉందని.. కనీసం కిడ్నీవేర్ సెంటర్‌నైనా ఏర్పాటు చేయాలని.. నెప్రాలజిస్ట్, ఇద్దరు జనరల్ ఫిజిషియన్‌లను కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.
