టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్విటర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్‌లో ఉన్నారని.. అందులో రోజూ నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని అన్నారు. ప్రతిరోజూ నిన్ను, నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారని.. దమ్ముంటే నువ్వు మీ జగన్‌కి చెప్పి, వెంటనే సస్పెంట్ చేయించు అ‘నిల్లు’ అంటూ కాల్వ శ్రీనివాసులు సవాల్ విసిరారు.
ఇదిలావుండగా.. వైసీపీ ఎమ్మెల్యేల్ని కలుస్తున్న టీడీపీ నాయకుల్ని సస్పెండ్ చేసే దమ్ముందా? అంటూ అంతకుముందు అనిల్ ఛాలెంజ్ చేశారు. లోకేష్ మరోసారి ఆంధ్రా పప్పుగా నిరూపించుకున్నారని ఎద్దేవా చేసిన అనిల్.. ఆయనకు వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. అక్రమ లే-ఔట్లకు వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ నిలిపివేసిందని, రాష్ట్రంలో అవినీతి లేని పాలనని జగన్ కొనసాగిస్తున్నారని, లోకేష్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. జిల్లాలోని టీడీపీ నేతలు చీకటి రాజకీయాలు చేస్తున్నారని.. వారి లాలూచీ వ్యవహారాన్ని నిరూపిస్తానని.. అందుకు లోకేష్ సవాల్ స్వీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కాల్వ శ్రీనివాసులు పై విధంగా ఘాటుగా స్పందించారు.