Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు

Jyothula Nehru

Jyothula Nehru

Jyothula Nehru: జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తాను ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు రాజకీయ ఉద్దేశాలతో వెళ్లలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా బ్లాక్‌మెయిల్ చేయడం కోసం ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని, దానిపై వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అయితే, ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేస్తున్న రాజకీయ ట్రాప్‌లో తమ పార్టీకి చెందిన కొందరు నేతలు పడుతున్నారని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులను పార్టీ నేతలు గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం సరైన వ్యాఖ్య కాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలకు ఒక్క అంశాన్ని మాత్రమే కారణంగా చెప్పడం సమంజసం కాదన్నారు జ్యోతుల నెహ్రూ.. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. మెజారిటీ కాపులు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ముద్రగడ పద్మనాభం తనకు బంధువని, అలాగే తన నియోజకవర్గానికి చెందిన నాయకుడని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఆ వ్యక్తిగత అనుబంధం కారణంగానే సంస్మరణ సభకు వెళ్లానని, అక్కడ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇక, కాపు సామాజిక వర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తమ స్థాయిలో చేయాల్సిన ప్రతి పని చేస్తామని, కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.