రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడని.. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం సేవించాడని ఎస్పీ వివరించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని తన కారులో తీసుకెళ్లారని చెప్పారు.
సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు అప్పు ఇవ్వగా.. అందులో కొంత నగదును సుబ్రహ్మణ్యం తిరిగి చెల్లించాడని.. మిగిలిన రుణం చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని కాకినాడ ఎస్పీ తెలిపారు. దీంతో పద్ధతి మార్చుకోవాలని సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హెచ్చరించారని.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తిరగబడేసరికి అనంతబాబు దాడి చేయగా సుబ్రహ్మణ్యం తలకు గాయమైందని వివరించారు. సుబ్రహ్మణ్యం లేచి మళ్లీ అనంతబాబు మీదకు వెళ్లగా గ్రిల్ తగిలి మరోసారి తీవ్రగాయం కావడంతో అతడిని ఎమ్మెల్సీ ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారన్నారు.
MLC Anantha Babu: సుబ్రహ్మణ్యం బ్లాక్‌మెయిల్ చేశాడు.. అందుకే..!!
అయితే కారులో తరలిస్తుండగా సుబ్రహ్మణ్యానికి శ్వాస రావట్లేదని గమనించిన అనంతబాబు.. ప్రమాదం జరిగినట్లు ఇంట్లో చెబితే అనుమానం రాదని భావించాడని.. దీంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహంపై కర్రతో కొట్టాడని కాకినాడ ఎస్పీ వివరించారు. సుబ్రహ్మణ్యంకు ప్రమాదం జరిగిందని అతడి తల్లికి అనంతబాబు ఫోన్ చేసి చెప్పాడని.. సుబ్రహ్మణ్యంను ఆ తర్వాత అమృత ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అతడు చనిపోయినట్లు చెప్పారన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అనంతబాబు తల్లిదండ్రులకు అప్పగించాడని పేర్కొన్నారు.